శ్రీకాకుళం అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలి

శ్రీకాకుళం అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలి

విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ ):-  శ్రీకాకుళం నగర వీధుల్లో సాగిన పాణిగ్రాహి 54వ స్మారక సభ ప్రచార యాత్రలో ప్రజా సంఘాల నాయకుల డిమాండు అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని అరుణోదయ, ఏ ఐ కే యం యస్, ఐ ఎఫ్ టి యు, డికేయస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ డిసెంబర్‌ 12 నుండి చేస్తున్న సమ్మెకు వారు సంపూర్ణ మద్దతును తెలిపారు. ప్రభుత్వ విచ్చిన్న ఎత్తుగడలను ఎదుర్కొని కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా నిలబడాలని, అన్ని వర్గాల తరగతుల ప్రజలు, ప్రజాతంత్ర వాదులు అంగన్‌వాడీలకు సంఘీభావంగా నిలబడాలని అఖిల భారత రైతు - కూలీ సంఘం రాష్ట్ర సహాయకార్యదర్శి తాండ్ర ప్రకాష్, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర సహాయకార్యదర్శి డి.గణేష్, దళిత డప్పు కళాకారుల సంఘం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు నిమ్మల సంజీవ్ కోరారు. విప్లవకవి సుబ్బారావు పాణిగ్రాహి 54వ వర్థంతి సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం నగర వీధుల్లో నిర్వహించిన ప్రచార యాత్రలో వారు పాల్గొని మాట్లాడారు. 2019 ఎన్నికల్లో అంగన్‌వాడీలకు తెలంగాణా మీద వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని వాగ్ధానం చేసి, ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌ మాట తప్పారన్నారు. కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీని అమలు చేయాలని, రిట్కెర్మెంట్‌ బెనిఫిట్స్‌ పెంచి, పెన్షన్‌ 50% అమలు చేయాలనే కనీస కోర్కెలు అమలు కోసం గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. కార్మికులు దశలవారీగా అనేక రూపాలలో ఆందోళనల తరువాత విసిగి వేసారి చిట్ట చివరకు సమ్మెకు దిగారన్నారు. ఈ సమ్మెను నివారించే అవకాశం ఉన్నా ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల ప్రభుత్వ అధికారులు, సచివాలయ ఉద్యోగులు అంగన్‌వాడీల కేంద్రాల తాళాలు పగులగొట్టి చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకుంటున్నారని తెలిపారు. కొంతమంది అధికార పార్టీ ఎమ్మేల్యేలు బాధ్యాతారహితంగా మాట్లాడుతున్నారని తెలిపారు. అంగన్‌వాడీలపై నోరుపారేసుకున్న బొబ్బిలి ఎమ్మేల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రశాంతంగా సాగుతున్న సమ్మెను శాంతి భద్రతల సమస్యగా మార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు. ఈ సమ్మెకు పోలీసులు, సచివాలయ ఉద్యోగులు దూరంగా ఉండాలని చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని కోరారు. ప్రశాంతంగా జరిగే సమ్మెను అక్రమ పద్దతుల ద్వారా విచ్చిన్నం చేసే ప్రభుత్వ యత్నాలను తమ సంస్థలు ఖండిస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞతతో అంగన్‌వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవచూపి సమ్మెను విరమింపజేయాలని కోరారు. డిసెంబర్ 22న పాణిగ్రాహి స్మారక సభకు తరలి రండి .డిసెంబర్ 22న పాణిగ్రాహి 54వ స్మారక సభా ప్రాంగణం బొడ్డపాడు కు ప్రజలు తరలి రావాలని వారు కోరారు. అరుణోదయ, ప్రజా కళామండలి సంస్థలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఈసభలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సాగే ప్రతిపోరులోన సాహసమై కదిలే తెగువను అందించిన విప్లవ కవికి పోరాటాలను నిర్మించడం ద్వారానే నిజమైన నివాళి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల కార్యకర్తలు పుచ్చ భాస్కరరావు , గురువులు ,అప్పన్న నానారావు, జైరామ్ , విష్ణు, బేతరాజు ,అప్పయ్య ,అప్పన్న, బోనెల రామయ్య, బలగ అప్పారావు, లక్ష్మీనారాయణ డోలాపు అప్పన్న , నోకన్న తదితరులు ఈ ప్రచార యాత్రలో పాల్గొన్నారు.