హై రిస్క్ గర్భవతులు జాగ్రత్త వహించాలి....
హై రిస్క్ గర్భవతులు జాగ్రత్త వహించాలి....
కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పట్ల పిల్లలు, వృద్ధులు మరియు అతి ముఖ్యముగా గర్భవతులు జాగ్రత్త వహించాలని వైద్యాధికారి డాక్టర్ కమల్ రోహిత్ పేర్కొన్నారు. ఈరోజు ఓ డి సి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిర్వహించిన ప్రధానమంత్రి సురక్షిత మాతృ వందన అభియాన్ కార్యక్రమం నందు పాల్గొంటు ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలానుగుణంగా వాతావరణం లో వచ్చే మార్పుల వలన కలిగే ఆరోగ్య సమస్యలలో ఎండాకాలంలో కలిగే వడదెబ్బ అతి ప్రమాదకరమైనదని పిల్లలు, వృద్ధులు గర్భవతులు ఈ వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. చెమట పట్టకపోవడం, తీవ్రస్థాయి జ్వరం, వణుకు, కలవరింతలు, పాక్షిక అపస్మారకం వడదెబ్బ లక్షణాలు కాగా, ఈ సందర్భంలో తీవ్ర ఉష్ణోగ్రతలలో ఎక్కువగా తిరగకుండా, గాలికి గురికాకుండా, రోడ్లపై అమ్మే రంగు పానీయాలు మరియు ఆహారం తీసుకోకుండా, మాంసాహారం తగ్గించి, మద్యం సేవించకుండా, నలుపు_ ముదురుగా ఉన్న దుస్తులు ధరించకుండా, ముఖ్యంగా ఎండలో శరీరంపై భారం పడే పనులు చేయకుండా జాగ్రత్త వహించాలని ఉద్ఘాటించారు. వడదెబ్బ నివారణలో భాగంగా నీరు, పళ్ళ రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, రోజు కనీసం 15 గ్లాసుల నీళ్లు త్రాగడం, మిత భోజనం, ఎండలో గొడుగు లేదా టోపీ వంటివి వాడడం, ఇంటిలో కిటికీలు తెరచి ఉంచడం, రెండు పూటలా స్నానం చేయడం వంటివి ఆచరణలో ముఖ్యమైనవిగా సూచించారు. వడదెబ్బ తగిలినప్పుడు ప్రథమ చికిత్సలో భాగంగా వడదెబ్బ తగిలిన వ్యక్తులను త్వరగా నీడ కల ప్రదేశానికి చేర్చడం, శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేవరకు శరీరాన్ని తడి గుడ్డతో తోడవడం, చల్లని గాలి తగిలేలా ఉంచడం మరియు ఇంటి వైద్యంలో భాగంగా చిటికెడు ఉప్పు, చారెడు చక్కెర మిశ్రమ ద్రావణం లేదా ఓ ఆర్ ఎస్ ద్రావణం త్రాగించడం, తదుపరి సమీప ఆరోగ్య కేంద్రమునకు తరలించాలని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఇతర ఆరోగ్య సూచన అంశాలైన రక్తహీనత, పోషక విలువల ఆహార లభ్యత మరియు వినియోగం, హై రిస్క్ లక్షణాలు గుర్తింపు, ఆసుపత్రి ప్రసవం, సంక్రమణ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టిబి, కుష్టు తదితర వ్యాధులపై ఆరోగ్య విద్య, అవగాహన కల్పించి హాజరైన 49 మంది గర్భవతులలో 20 మందిని ప్రమాద సంకేత గర్భవతులుగా గుర్తించి ప్రత్యేక చికిత్స, స్కానింగ్, రెఫరల్ సేవలు, అందరికీ ఉచిత మందుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంనకు హాజరైన గర్భవతులు మరియు వారి సహాయకులకు రోటరీ క్లబ్ దాతలు నాగేళ్ల రంజిత్ కుటుంబ సభ్యులు భోజన సౌకర్యం కల్పించారు. ఇంకా ఈ కార్యక్రమం నందు ఆరోగ్య, ఆశ, అంగన్వాడి సిబ్బందితోపాటు ఇతరులుపాల్గొన్నారు.