విద్యా వ్యాపారంలో నిట్ కుంభకోణం విష ఫలితమే-గోవిందరాజులు

విద్యా వ్యాపారంలో నిట్ కుంభకోణం విష ఫలితమే-గోవిందరాజులు

విద్య వ్యాపారీకరణ విష ఫలితమే‘నీట్‌కుంభకోణం-ఎస్. గోవింద రాజులు

                                              విజయవాడ-జన చైతన్య(తమ్మిన గంగాధర్)  ___ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీనే నీట్–యూజీ ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఇలా జరగడం యాదృచ్ఛికం కావచ్చు. లేదా ఏదో మతలబు ఉందని సందేహించవచ్చు. ఎన్నికల ఫలితాల సంభ్రమంలో దీన్ని గురించి ఎవరూ ఆలోచించే అవకాశం ఉండదనేది ఎత్తుగడేమో అన్న అనుమానం కూడా తలెత్తవచ్చు. ఏది ఏమైనా చివరకు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసే విధంగా వందల కోట్ల రూపాయలు చేతులు మారిన నీట్ కుంభకోణం బట్టబయలైంది. ఒకవైపు మూడోసారి మోదీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం, మంత్రి పదవుల పంపకాలు జరుగుతుంటే, మరోవైపు నీట్ అవినీతి దుమారం మీడియాను ముంచెత్తింది. ఈ పరిణామం లక్షలాది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఎంతో క్షోభకు గురి చేసింది. సుప్రీంకోర్టు సైతం ‘నీట్ పవిత్రత దెబ్బ తింది’ అని తీవ్రంగా వాఖ్యానించింది. ఇంత జరిగినా, లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారినా, దేశవ్యాప్త నిరసనలు చెలరేగుతున్నా ప్రధానమంత్రి మాత్రం పెదవి విప్పలేదు. ఇది మోదీ మార్కు పాలనకు మరొక ఉదాహరణ. తమ ప్రభుత్వంపై పడిన అవినీతి మరకను కప్పిపుచ్చుకోవడానికి ఎన్టీఏ అధికారులను బలి పశువులను చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్టీఏను సంస్కరించే పేరిట ఏవో చర్యలు, ప్రకటనలు వెలువడుతున్నాయి. అసలు కేంద్ర ప్రభుత్వం అకడమిక్ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధంలేని ఎన్టీఏ లాంటి ఒక బ్యూరోక్రటిక్ సంస్థను ఎందుకు ఏర్పాటు చేసింది? ఆ సంస్థకు నీట్, జేఈఈ వంటి అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షలతో సహా అన్ని రకాల పోటీ పరీక్షల నిర్వహణను ఎందుకు అప్పగించింది? ఇలాంటి కీలక ప్రశ్నలు చర్చకు రావడం లేదు. నీట్ కుంభకోణం నేపథ్యంలో మన దేశ విద్యారంగంలో అమలవుతున్న విధానపరమైన మార్పులను నిశితంగా పరిశీలించాలి. ఎందుకంటే ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షలలో అక్రమాలు, ఫలితాలలో అవకతవకలు తదితర సమస్యలన్నీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్య వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ అనే ప్రధాన విధానంతో ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం అమలవుతున్న జాతీయ విద్యావిధానం–2020లో యావత్తు విద్యను, ప్రత్యేకించి ఉన్నత విద్యను గంపగుత్తగా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి అవసరమైన సిఫార్సులు చాలా ఉన్నాయి. ఈ విధానం నిరాటంకంగా, వేగంగా అమలు కావడానికి విద్యా రంగంలోని అన్ని అధికారాలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి బదలాయించే చర్యలు వరుసగా చేపడుతున్నారు. రాజ్యాంగంలో విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ, రాష్ట్రాల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా అన్ని వ్యవహారాలను కేంద్రమే నిర్దేశించడం ఫెడరల్ సూత్రాలకు పూర్తి విరుద్ధం. ఈ విధమైన అధికారాల కేంద్రీకరణలో భాగంగానే గతంలో రాష్ట్రాల పరిధిలో ఉన్న మెడికల్ ప్రవేశాలు, అడ్మిషన్ల మొత్తం ప్రక్రియను కేంద్రం నియమించే వ్యక్తులతో కూడిన ఎన్టీఏకు అప్పగించారు. దీనితో యూనివర్శిటీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి.

నీట్‌ను ప్రవేశపెట్టిన తరువాత మెడికల్ విద్యలో చోటుచేసుకున్న మార్పుల గురించి అమృత్‌సర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా పనిచేసిన డాక్టర్ శ్యామ్ సుందర్ దీప్తి వెలిబుచ్చిన అభిప్రాయాలు గమనార్హమైనవి. ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటి 2021 అక్టోబర్ 31న జాతీయవిద్యావిధానం–2020పై నిర్వహించిన ఒక జాతీయ స్థాయి సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ ఇలా చెప్పారు: ‘‘నీట్‌కు ముందు, ఆ తర్వాత విద్యార్థులకు కల్పించబడిన ప్రవేశాలలో చాలా వ్యత్యాసం ఉంది. అంతకు ముందు సంవత్సరాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి, వివిధ రకాల ఆర్థిక–సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులందరూ ప్రవేశాలు పొందారు. అయితే నేడు కేవలం నగరాలు, మహానగరాల నుండి వచ్చిన విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. ఈ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మధ్య, దిగువ మధ్య తరగతి నుండి ప్రవేశాలు పొందిన విద్యార్థులను వేళ్లపై లెక్కించవచ్చు. దీనికి కారణం సుస్పష్టం. నీట్ ప్రవేశ పరీక్షకు సన్నద్ధమవడానికి కోచింగ్ సెంటర్లకు, అదేవిధంగా కోర్సులో చేరిన తరువాత మెడికల్ కళాశాలలకు చెల్లించవలసిన ఫీజులు అత్యధికంగా ఉండటమే. ఈ ఫీజులు కనీసం 25 లక్షల నుండి 30 లక్షల వరకు ఉంటున్నాయి. ఇంత పెద్ద మొత్తాన్ని మధ్యతరగతి కుటుంబాలు భరించడం చాలా కష్టం. ఈ భారీ ఫీజులకు కారణం మొత్తం మెడికల్ కళాశాలల్లో 50 శాతానికి పైగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనూ, కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోనూ ఉండటమే. వారి చేతుల్లో కేవలం కళాశాలలను ఉంచడమేగాక, వారికి అనుకూలంగా విద్యాప్రణాళిక రచించబడింది కూడా! కార్పొరేట్ వ్యవస్థను నడిపే పనిముట్లుగా శిక్షణ పొందిన సిబ్బందిని ఉత్పత్తి చేయడమే ఈ విద్యా ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యం.’’ ఈ అభిప్రాయాలు ఎంత వాస్తవికంగా ఉన్నాయో మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రస్తుతం జరిగిన నీట్ కుంభకోణం వంటివి భవిష్యత్తులో మరిన్ని పెద్ద స్థాయిలో జరిగే అవకాశాలు లేకపోలేదు. కావున నీట్‌ను తిరిగి నిర్వహించాలనే డిమాండ్‌తో పాటుగా ఎన్టీఏను తక్షణం రద్దు చేయాలని, విద్యలో అన్ని చెడులకు మూలమైన విద్య కార్పొరేటీకరణ, అధికారాల కేంద్రీకరణ విధానాన్ని ఉపసంహరించాలని కోరుతూ ఒక సమరశీల ఉద్యమాన్ని నిర్మించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.