సెంట్రల్ గాయత్రి కన్వెన్షన్ లో ఉగాది మహోత్సవాలు-మల్లాది విష్ణు

సెంట్రల్  గాయత్రి కన్వెన్షన్ లో ఉగాది మహోత్సవాలు-మల్లాది విష్ణు

గాయత్రీ కన్వెన్షన్ సెంటర్ లో కన్నులపండువగా ఉగాది మహోత్సవం

ప్రకృతి పండుగ ఉగాది

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)

రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది మహోత్సవ వేడుకలు గాయత్రీ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, వేద పండితులచే వేద స్వస్తి నిర్వహించారు. అనంతరం జ్యోతిష్య విశారద కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. పంచాంగ శ్రవణం వల్ల సౌభాగ్యం, సంపద, దీర్ఘాయుష్షు కలిగి వ్యాధి బాధలు తొలగుతాయని సుబ్బరామ సోమయాజి చెప్పారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. పంటలు బాగా పండి రైతు ఆనందంగా ఉంటాడని  ప్రజలకి జీవనోపాధి అవకాశాలు మెరుగు పడతాయని పేర్కొన్నారు. అనంతరం ఆయా రాశుల వారికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో దేశ కాల, ఋతు పరిస్థితులను, నక్షత్ర, రాశి, వారాది ఫలితాలను వివరించారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు మాట్లాడుతూ తెలుగు జాతికి ముఖ్యమైన పండుగ ఉగాది అని తెలిపారు. బ్రహ్మ ఉగాది రోజునే సృష్టిని ప్రారంభించాడని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. పూర్వం రాజులు ప్రతిరోజూ పంచాంగ శ్రవణం చేసేవారని, ఇది ఎంతో పుణ్యఫలమని అన్నారు. అలాగే ఉగాది పచ్చడిలో జీవితసారం దాగి ఉందన్నారు. ఉగాది పచ్చడి ఆరు రుచుల సమ్మేళనమని, ప్రతి రుచికీ ఒక అనుభూతి ఉంటుందన్నారు. ఆ అనుభూతుల సమ్మేళనమే జీవితమని తెలియజేశారు. మానవజీవితం సుఖదుఃఖాల సమాహారమని, అన్నింటినీ సమభావనతో స్వీకరించి ముందుకెళ్లాలని సూచించారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నిండాలని అభిలషించారు. అనంతరం మల్లాది విష్ణు చేతులమీదుగా పంచాంగకర్తను దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. ఉగాది పచ్చడి, ప్రసాదం వితరణ చేశారు. పంచాంగ పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తి, గాయత్రీ సొసైటీ గౌరవాధ్యక్షులు పోతప్రగడ మణికుమార్, అధ్యక్షులు గంటి ఈశ్వర్, ఉపాధ్యక్షులు నోరి సూర్యనారాయణ, జనరల్ సెక్రటరి చల్లా హరికుమార్, సెక్రటరి దూబగుంట శ్రీనివాస్, కోశాధికారి జె.కె.సుబ్బారావు, కోర్ కమిటీ సభ్యులు మల్లాది రాజేంద్రప్రసాద్, భర్తేపూడి శ్రీనివాస్, సభ్యులు సి.హెచ్.మారుతీ ప్రసన్న, జి.వి.ఎస్ శర్మ, వి.లక్ష్మి నారాయణ, సి.ఎన్.మూర్తి, ఎస్.రవికుమార్, సి.సూర్యప్రకాష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.