వైకాపాకు ఘోరీ కట్టేది అమరావతే

వైకాపాకు ఘోరీ కట్టేది అమరావతే

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య స్పష్టీకరణ తానొకటి తలిస్తే, దైవం మరొకటి తలచినట్లు, ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయాలని భావించిన వైకాపా ప్రభుత్వం తన వినాశనానికి చేరువైందని, వైకాపా అధికారానికి ఘోరీ కట్టేది అమరావతి ఉద్యమమే అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య స్పష్టం చేశారు. విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. శైశవ దశలో ఉన్న అమరావతి బాలుడిని వడ్ల గింజ వేసి చంపేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల మూడు ముక్కలాటకు తెరలేపారని చెప్పారు. అధికారంలోకి రాక ముందు అమరావతిని అమ్మ అని పిలిచిన ముఖ్యమంత్రి, అధికారంలోకి రాగానే అమరావతిని 'నీ అమ్మ' అంటూ నిందించారని పేర్కొన్నారు.1436 రోజుల రాజధాని ఉద్యమం ఎన్నో చెరలను, ఆవేదనలను, ఆందోళనలను చూసిందన్నారు. దాదాపు 3 వేలకు పైగా కేసులు పెట్టారని, 200 మందికి పైగా రైతులు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ప్రభుత్వ వేధింపులకు ప్రాణాలు బలి తీసుకున్నారని వాపోయారు. న్యాయస్థానాలకు మూడు రాజధానుల బిల్లును, సిఆర్డీఎ రద్దు చట్టాన్ని వెనక్కి తీసుకున్నా అంటూనే, ప్రజలకు మాత్రం మూడూ ఉన్నాయని అబద్ధాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు చెప్పినా, సుప్రీం కోర్టు స్టే ఇవ్వకపోయినా రుషికొండకు పారిపోయేందుకు ముఖ్యమంత్రి పదే పదే ప్రకటనలు చేస్తున్నట్లు ఆరోపించారు. రైతుల ఉసురు తగిలి, మహిళల కన్నీరు తగిలి, దళితుల శాపనార్ధాలు తగిలి కేసీఆర్ లా వైకాపా కూడా కాలు జారి కింద పడక తప్పదన్నారు. ప్రతిపక్ష పార్టీలు తమ మేనిఫెస్టోలో అమరావతే ఏకైక రాజధానిగా చేర్చాలని, అధికారంలోకి రాగానే రైతులపై పెట్టిన అన్ని కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని ఉద్యమం నుంచి కూడా చట్టసభలకు వెళ్లే ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉద్యమకారులపై ఎంతైనా ఉందని, ఈ మేరకు ప్రధాన రాజకీయ పార్టీలపై వత్తిడి తీసుకురావాలని అన్ని జెఎసి లకు బాలకోటయ్య సూచించారు. రాజధాని రైతు పరిరక్షణ సమితి నాయకులు ఇడుపులపాటి సీతారామయ్య మాట్లాడుతూ వ్యక్తులు అడిగితే, రాజధాని రైతులు భూములు ఇవ్వలేదని , ప్రభుత్వం అడిగితే ఇచ్చారని చెప్పారు. ప్రభుత్వాలు మారితే రాజధానులు మారుతాయన్న సంగతి తమకు తెలియదన్నారు. మహిళా రైతు కొమ్మినేని వరలక్ష్మి మాట్లాడుతూ రాజధాని మహిళలపై జరిగిన దాష్టీకాలను వివరించారు. మహిళల చీరలు లాగాలని , జాకెట్లు చించారని, రక్తాలు కళ్ళ చూశారని వాపోయారు. మహిళలపై కేసులు పెట్టి వేధించారని విమర్శించారు. మహిళలపై కక్ష గట్టిని ప్రభుత్వానికి మహిళలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రెల్లి సంక్షేమ సంఘం నాయకులు శిరంశెట్టి నాగేంద్రరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు ద్రోహం చేసిందన్నారు. అంగన్వాడీ సమస్యలను కూడా పరిష్కరించలేక, అంగన్వాడీ కార్యాలయాల తాళాలు పగులగొడుతున్నారని, వైసిపి ప్రభుత్వం తాళాలను కూడా ప్రజలు పగల గొట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.