ప్రకృతిని కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి

ప్రకృతిని  కాపాడుకోవడమే  నిజమైన  దేశభక్తి

ప్రకృతిని కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి

విజయవాడ -జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

సహజ వనరులను భావితరాలకు సుసంపన్నంగా అందజేయాలి

ప్రకృతితో ముడిపడిన పండగ సంక్రాంతి

పదిమందితో పంచుకోవటమే భారతీయ సంస్కృతి

భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు .విజయవాడ స్వర్ణ భారత్ ట్రస్ట్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు . కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి హాజరు .  విజయవాడ    ప్రకృతిని కాపాడుకోవటమే నిజమైన దేశభక్తి అని భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ప్రకృతిని ప్రేమించటం, ప్రకృతితో కలిసి జీవించటమే మన సంస్కృతి అని స్పష్టం చేశారు. మకర సంక్రాంతి పర్వదినం సమీపిస్తున్న వేళ  శుక్రవారం ఆత్కూర్ లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ లో సంప్రదాయ బద్ద సంక్రాంతి సంబరాలను శ్రీ వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి ప్రసంగించారు.  ఆత్మీయులు, సన్నిహితులు, మిత్రులు, కుటుంబ సభ్యులతో కలసి సంబరాలలో పాల్గొన్నారు.

అంతకుముందు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. స్వామి వివేకానంద ఈ దేశ యువతలో నింపిన స్ఫూర్తి గురించి వివరించారు.

ఈ సందర్భంగా శ్రీ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రకృతి వనరులను భావితరాలకు సుసంపన్నంగా అందించాల్సిన అవసరం ఉందని,  ఇదే నిజమైన దేశభక్తి అని చెప్పారు. 

తెలుగువారి పెద్ద పండగ అయిన సంక్రాంతి ప్రకృతితో మమేకమైన పెద్ద వేడుక అని చెప్పారు. మానవాళి జీవితంలో పశు పక్ష్యాదుల సహకారం వెలకట్టలేనిదని,  అందుకే భారతీయ సంస్కృతిలో సంక్రాంతి మరునాడు వచ్చే కనుమ రోజున పశువులను పూజించి, గౌరవించి పండుగ చేస్తారని, ప్రపంచంలో మరే ప్రాంతంలోనూ ఇలా పశువులను గౌరవించే సంస్కృతి లేదని చెప్పారు. పశుసంపదే దేశ సంపద అని మహాత్మా గాంధీ స్పష్టం చేసిన సంగతిని శ్రీ వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. 

తాను రైతు బిడ్డనని, పల్లెలన్నా,  గ్రామీణ సంస్కృతి అన్నా, రైతులన్నా ఎంతో ఇష్టమన్నారు. 

స్నేహితులు,  బంధువులు, ఆత్మీయులతో ఇలా కలిసి పండుగలు జరుపుకోవాలని అన్నారు.   ప్రకృతికి అనుగుణంగా మన జీవనశైలి ఉండాలని చెప్పారు. "పుట్టినరోజు కావచ్చు, వివాహాలు కావచ్చు, ఇతర సందర్భాలు ఏవైనా కావచ్చు. ఒక్క మొక్క నాటండి. దానికి నీళ్ళు పోసి పెంచండి. నేను చెప్పిన మాటల్లోని అంతరార్థం ఏమిటో మొక్క పెరిగాక మీకే తెలుస్తుంది." అని చెప్పారు.

ప్రత్యక్ష భగవానుడు సూర్యుడని,  సూర్యుడి వల్లే మన జీవన చక్రం నడుస్తోందని చెబుతూ,  సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి సూర్యాస్తమయాన్ని కల్లా పనులు ముగించుకొని త్వరగా నిద్రపోవాలని సూచించారు. రాత్రి వేళల్లో ఎక్కువగా మేల్కొని ఫోన్లు చూసే అలవాటును పిల్లలతో మాన్పించాలని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించాలని, లేదంటే వారి మానసిక సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.

భారతీయ సంస్కృతిని, మాతృభాషను పరిరక్షించుకోవాలని సూచించారు. కన్న తల్లిదండ్రులను,  పుట్టిన ఊరును,  గురువును,దేశాన్ని ఎట్టి పరిస్థితులలోనూ సదా గౌరవిస్తూ ఉండాలని చెప్పారు. 

మనకున్న దానిని పదిమందితో పంచుకోవడమే సంస్కృతి అని చెబుతూ చక్కటి ఉపమానాన్ని పేర్కొన్నారు. మన వద్ద ఉన్న రొట్టెను మనమే తింటే అది ప్రకృతి అని,  ఇతరుల వద్ద ఉన్న దానిని లాక్కొని తింటే అది వికృతి అని,  మన వద్ద ఉన్న రొట్టెను ఇతరులతో పంచుకుని తింటే అదే సంస్కృతి అని వివరించారు. రైతులు తమకు ఉన్న దానిని ఇతరులతో చక్కగా పంచుకుంటారని చెబుతూ "ఇదంతా మన సంస్కృతిలో భాగమే. అందుకే సంక్రాంతి అంటే రైతుల పండుగ. ఈ పండుగ వస్తే మా తాత నాకు గుర్తుకు వస్తారు. వారు ప్రతి సంక్రాంతికి చేసే కార్యక్రమాలే, నాకు భారతీయ సంస్కృతి పట్ల చిన్నతనంలోనే అవగాహన పెంచాయి. అందుకే ఉన్నంతలో కుటుంబ సభ్యులతో కలిసి పండుగలను నిర్వహించుకోమని ప్రోత్సహిస్తూ ఉంటాను.

పండుగ అంటే కొత్తబట్టలు, పిండి వంటలే కాదు, మన సంస్కృతి సంప్రదాయాలు. మన ఆచార వ్యవహారాలు. మన ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలి, పెద్దలకు గౌరవాన్ని ఇవ్వాలి. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలి." అని చెప్పారు. అంతకుముందు శుక్రవారం ఉదయం మకర సంక్రాంతి సంబరాలు గంగిరెద్దుల ఆటలతో సంప్రదాయ సిద్ధంగా, ఘనంగా ప్రారంభమయ్యాయి. గొబ్బెమ్మలు కొలువుతీరిన అందమైన రంగవల్లులు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల సంకీర్తనలు, సంప్రదాయ సంగీత విభావరులతో అందమైన పల్లె వాతావరణం కళ్ళముందు సాక్షాత్కరించింది.  ఆడిటోరియంలో వేదిక ముందు సిరి ధాన్యాలతో తీర్చిదిద్దిన రంగవల్లిక ఎంతో ఆకట్టుకోవడంతోపాటు ధాన్యాల ప్రాధాన్యాన్ని తెలియజెప్పింది. వేదిక అలంకరణ పల్లె లోగిలిని తలపించింది. తిరుమల తిరుపతి దేవస్థానం గాయకులు శ్రీ వేదవ్యాస  ఆనంద భట్టర్  ఆలపించిన అన్నమయ సంకీర్తనలు ఆధ్యాత్మిక తన్మయత్వంలోకి తీసుకువెళ్లాయి. శ్రీ అన్నమాచార్యుల వారి సాహిత్యంలోని విశిష్టతను వారు వివరిస్తూ అద్భుతంగా కీర్తనలను ఆలపించారు. సంక్రాంతి పర్వదినం విశిష్టతను వివరిస్తూ శ్రీ గరికపాటి నరసింహారావు చేసిన ప్రవచనం నేటి తరానికి మార్గదర్శనంగా ఉంది.  హిందూ సంస్కృతి ఔన్నత్యాన్ని, తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని వారు చక్కగా వివరించారు. ప్రముఖ గాయకురాలు శ్రీమతి ఎస్పీ శైలజ  సినీ సంగీత విభావరి ఎంతో అలరించింది. వారి గాన మాధుర్యంతో  శ్రోతలను కట్టిపడేశారు. మొత్తం మీద ఈ సంక్రాంతి సంబరాలు అతిథులకు మధుర  జ్ఞాపకాన్ని మిగిల్చాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ,తీపి వంటకాలు, షడ్రసోపేతమైన విందుతో కూడిన ఆతిథ్యం వారికి ఎంతో సంతృప్తిని మిగిల్చింది. ఈ సంబరాలకు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి  ఆత్మీయ అతిథిగా, భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి  ప్రత్యేక అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ పూర్వ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్  తదితరులు  కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు స్వర్ణ భారత్ ట్రస్ట్ సభ్యురాలు శ్రీమతి దీపా వెంకట్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీ రామ మందిరాన్ని ప్రారంభిస్తున్న శుభ సందర్భాన్ని ప్రస్తావిస్తూ హర్షం వ్యక్తం చేశారు. అందుకు నాందిగా స్వర్ణభారత ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీరామ కళ్యాణం తదితర పుణ్య క్రతువులను గురించి వివరించారు. అయోధ్య కేసును గెలిపించిన ప్రముఖ న్యాయ కోవిదుడు శ్రీ పరాశరన్ ని గౌరవిస్తూ వారికి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు విశిష్ట పురస్కారాన్ని వారి ఇంటికి వెళ్లి సగౌరవంగా ప్రధానం చేసిన సంగతిని సభికుల కరతాళ ధ్వనుల మధ్య తెలియజేశారు. ఇదే పురస్కారాన్ని అంతకముందు భారత హరిత విప్లవ పితామహుడు,   రైతు బాంధవుడు ప్రొఫెసర్ శ్రీ ఎంఎస్ స్వామినాథన్ కు ప్రధానం చేసిన సంగతిని చెప్పారు.